Tuesday, September 02, 2008

ఉండ్రాళ్ళ పాయసం


కావలసినవి:-

పాలు: 1లీ"
బియ్యంపిండి:1గ్లాసు
నీళ్ళు:1గ్లాసు
కొబ్బరి:1కప్పు(తురిమినది)
నువ్వులపొడి:1కప్పు
పంచదార:150గ్రా
ఏలకులపొడి:2స్పూన్లు
నెయ్యి:2స్పూన్లు
ఉప్పు:చిటికెడు

తయారీ:-

ముందుగా ఒక పాత్రలొ గ్లాసు నీళ్ళు తీసుకొని మరిగించాలి .
నీళ్ళు మరుగుతుండగానె అదే గ్లాసుతో బియ్యపు పిండి తీసుకొని మెల్లగా వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి.
ముద్ద చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.
ఇప్పుడు కొబ్బరితురుము,నువ్వులపొడి కాస్తా నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాలు బాగా మరిగించి అందులో పంచదార కలిపి ఉండ్రాళ్ళు వేసి ఒక 15 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత (పాయసం మరింత చిక్కగా కావాలానుకుంటే కొద్దిగా పాలు తీసుకొని అందులొ బియ్యపు పిండిని కలిపి ఆచిక్కని మిశ్రమాన్ని పాలు మరుగుతున్నప్పుడు కలపాలి) కొబ్బరితురుము,నువ్వులపొడి,ఏలకులపొడి కలపాలి.
కమ్మని సువాసనతో పాయసం మీకొసం...
పాఠకులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలతో ...

Monday, January 14, 2008

కేరట్ హల్వా

కావలసినవి:

కేరట్ :500గ్రా
పాలు :600మి"లీ
పంచదార :50గ్రా
ఏలకులు :4(పొడిచేసుకోవాలి)
పిస్తా/బాదం :10-12
కిస్మిస్ :సరిపడినంత
నెయ్యి :2స్పూన్లు
కోవా :100గ్రా

తయారీ:

కేరట్ శుభ్రంగా కడిగి తొక్క తీసివేసి బాగా తురుము కోవాలి.
ఇప్పుడు పాలు బాగా కాచి అందులో కోవా, తరిగిన కేరట్ వేసి ఒక 10 నిమిషాలు (పాలు ఆవిరి అయ్యేవరకు)ఉడకనివ్వాలి.
తరువాత అందులో పంచదార,ఏలకులపొడి,నెయ్యి,కిస్మిస్ వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు తర్వాత స్టవ్ పై నుంచిదించెయ్యాలి.
పిస్తా/బాదం పైన తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసి కేరట్ హల్వా పై అలంకరించాలి.
ఇప్పుదు రుచికరమైన హల్వా రెడీ.

Friday, January 11, 2008

మినప సున్నుండలు

కావలసినవి:

మినప్పప్పు:500గ్రా
పంచదార :350గ్రా
నెయ్యి :200గ్రా
ఏలకులు :5
పిస్తా/బాదం(చిన్న ముక్కలు) :సరిపడినంత

తయారీ:

మినప్పప్పును మంచి సువాసన వచ్చేవరకు (గ్యాస్ తక్కువలో పెట్టుకొని 15 నిమిషాలు )వేయించి,కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి .
విడిగా పంచదారను కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు రెంటిని బాగా కలిపి ఏలకులు,పిస్తా,బాదం పప్పులను కలిపి అందులొ వేడిచేసిన నెయ్యిని కలుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి.(నెయ్యి ఇష్టపడేవారు మరికాస్తా కలుపుకోవచ్చు)

అంతే... ఇప్పుడు ఘుమఘుమలాడే సున్నుండలు పండుగకి తయారు.
ఇక తినటమే తరువాయి....


సంక్రాంతి శుభాకాంక్షలు

Sunday, April 22, 2007

ఆంధ్రా పీతల ఇగురు

కావలసిన పదార్దాలు:

పీతలు - పెద్దవి నాలుగు (ఒకొక్కటి రెండు ముక్కలుగా చేసుకున్నవి)
పసుపు - 1 స్పూను
కారం - 2 స్పూను
జీలకర్ర - 2 స్పూన్లు
అవాలు - 1 స్పూను
మెంతులు - 1/2 స్పూను
కరివేపాకు - 2 రెమ్మలు
అల్లం, వెల్లుల్లి పేస్టు - 2 స్పూన్లు
ఉప్పు - సరిపడినంత
అజినొమొటొ - ఒక చిటికెడు (అదనపు రుచి కోసం)
నూనె - మూడు టేబుల్ సూన్లు (నాన్ స్టిక్ పాన్ అయితే రెండు)

తయారి:

ముందుగా పీతలు బాగా శుభ్రం చేసుకుని, పసుపు మరియు ఉప్పు చల్లుకుని ఒక ప్రక్కన వుంచాలి. ఇలా ఒక పదిహేను నిముషాలు వుండనివ్వాలి.

జీలకర్ర, ఆవాలు, మెంతులు దోరగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి

ఒక బాణలి (నాన్ స్టిక్ అయితే మంచిది) తీసుకుని నూనె అందులో వేసి కొద్దిగా వేడెక్కనివాలి

అందులో అల్లం, వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి బాగా కలియబెట్టాలి. కాసేపటికి మారినేట్ అయిన పీతలను అందులో వేసి కలియబెట్టాలి. కాసేపు వేపి, ఆ తరువాత ఇగురుకు సరిపడా (500 ml) నీటిని అందులో పోసి మూత పెట్టాలి.

పది నిమిషాలు సిమ్ లో వుడకనిచ్చి, తయారు చేసి పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడిని కలపాలి.

ఒక అయిదు నిమిషాలు వుడకనిచ్చి, అజినోమోటో కలిపి కలయబెట్టి దింపేస్తే ఘుమ ఘుమ లాడే పీతల ఇగురు తయారు.

గమనిక : ఎక్కువ సేపు వుడికిస్తే పీతల మాంసం చెదిరిపోయే ప్రమాదం వున్నది.

Saturday, October 28, 2006

గోంగూరపచ్చడి

కావలసిన పదార్దాలు

గోంగూర(ముదిరిన ఆకు) - 1kg
ఉప్పు - 500gm
ఎండుమిర్చి - 250gm
చింతపండు - 250gm
పోపు(తగినంత)
మెంతులు - 20gm
వెల్లుల్లి పాయలు - 250gm
పసుపు - 2స్పూన్లు
నువ్వుల నూనె - 600gm

తయారుచేయు విధానం

ఆకును శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.
బాగా ఒడలిన తర్వాత కొంచెం నూనె వేసి వేయించాలి.
కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి రెండు రోజులు పక్కన పెట్టాలి.
మూడవ రోజున చింతపండు బాగా వేడినీళ్ళలోనానబెట్టాలి.అది గుజ్జులాగ తయారవ్వాలి.
ఎండుమిరపకాయలు నూనెలో వేయించాలి.తర్వాత వెల్లుల్లిపాయలు దంచుకోవాలి.మెంతుల్ని వేయించి పొడి చేయాలి.
అన్ని కలిపి ఆకుతో సహా మిక్సీలోవేయాలి.
మిగిలిన నూనెను బాగా కాచి మూడు స్పూన్ల శనగపప్పు,మినపపప్పు,ఆవాలు,కొద్దిగా ఎండుమిరపకాయలు,కరివేపాకు,కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి దించేయాలి.
చల్లారిన తర్వాతపచ్చడిలో కలపాలి.
ఇక....రుచికరమైన గోంగూర పచ్చడి....మీదే....

Monday, October 02, 2006

చేగోడీలు

కావలసినవి

బియ్యపు పిండి - 3గ్లాసులు
మైదా - 1గ్లాసు
నెయ్యి - 50గ్రా
వాము - 1/2టీస్పూను
పసుపు - 1/4టీస్పూను
కారంపొడి - 1/2టీస్పూను
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడినంత


తయారుచేసే పద్ధతి

ముందుగా ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి ఎసరు పెట్టవలెను.
దానిలో తగినంత ఉప్పు వేసి ఎసరు మరిగిన తర్వాత స్టవ్ మీది నుంచి దించవలెను.
ఇప్పుడు వాము,కారంపొడి,పసుపు వేసి వెంటనే మొత్తం బియ్యపుపిండి,మైదాలను కలిపి దానిపైన నెయ్యి పోసి గిన్నెపై మూతపెట్టవలెను.

పిండి కొంచెం చల్లారిన తర్వాత పిండి ముద్దను రెండు అరిచేతులతో బాగా నలిపి సన్నగా తాడులా పొడవుగాచేసి కావలసిన సైజులో రింగులుగా అంటే గుండ్రంగా చేసి వేడినూనెలో ఎర్రగా వేయించి తీసేయవలెను. కరకరలాడే కమ్మని చేగోడీలు సిద్ధం.

చక్కెరపొంగలి

కావలసినవి

బియ్యం - 250గ్రా
పెసరపప్పు - 100గ్రా
యాలకులు - 5గ్రా
చక్కెర - 300గ్రా
జీడిపప్పు - 25గ్రా
కిస్మిస్ - 25గ్రా
నెయ్యి - 60గ్రా
ఎండుకొబ్బరి - 50గ్రా (తురిమినది)
పాలు - 1లీ
పచ్చకర్పూరం - చిటికెడు


తయారుచేసే పద్ధతి

బియ్యం,పెసరపప్పులను బాగా నీళ్ళలో కడిగి నీళ్ళు లేకుండా వంచేయాలి.
ఒక గిన్నెలోనెయ్యి తీసుకొని అందులో బియ్యం,పెసరపప్పు వేసి 5నిమిషాలు వేయించవలెను.
బియ్యం చిటపటలాడుతుండగా పాలుపోసి బాగా కలిపి మూతపెట్టి ఉడకబెట్టవలెను.
పూర్తిగా ఉడికినతర్వాత స్టవ్ మీది నుంచి దించి చక్కెర కలపవలెను.
తర్వాత ఒక చిన్న బాణలిలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్,తురిమిన ఎండుకొబ్బరిని వేయించి వాటికి చిటికెడు పచ్చకర్పూరం చేర్చి పొంగలిలో కలపవలెను.ఆపైన యాలకులపొడి చల్లవలెను.
ఘుమఘుమలాడే.....చక్కెరపొంగలి మీకోసం.....